కరోనా కొత్త వేరియంట్లను వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకుంటుందా? లేదా? అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ముంబయిలో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన డాక్టర్ శ్రిష్టి హిల్లరి(26) అనే యువ డాక్టర్ రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రెండుసార్లు కరోనా బారిన పడింది. అంతకుముందే తొలిసారి ఆమె కరోనా బారిన పడ్డారు.
ఈ విధంగా 13 నెలల్లో ఏకంగా మూడుసార్లు ఆమెకు కరోనా వైరస్ సోకింది. తొలి రెండు సార్లు ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉన్నప్పటికీ, మూడోసారి అదీ రెండు డోసులు తీసుకున్న తర్వాత సోకిన వైరస్ కారణంగా ఆమెకు తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ఉపశమనం కోసం రెమ్‌డెసివిర్ వేసుకోక తప్పలేదు.
ముంబైలోని వీర్ సావర్కర్ హాస్పిటల్‌లో కొవిడ్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ హల్లరికి గతేడాది జులై 17న తొలిసారి కరోనా సోకింది. అప్పుడు ఆమెలో సాధారణ లక్షణాలే కనిపించాయి. ఈ ఏడాది మార్చి 8న తొలి డోసు, ఏప్రిల్ 29న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మే 29న రెండో సారి కరోనా బారినపడ్డట్టు రిపోర్ట్స్ వెల్లడించాయి.
సింప్టమ్స్ మైల్డ్‌గానే ఉండటంతో ఇంట్లోనే కోలుకున్నారు. జులై 11న మరోసారి మొత్తం కుటుంబా(తల్లి, తండ్రి, సోదరుడు)నికి వైరస్ సోకింది. ఈ సారి వారి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అయిత టీకాలు ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోకున్నా ఆరోగ్యం దిగజారకుండా కాపాడుతాయని నిపుణులు ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే శ్రిష్టి హిల్లరి విషయంలో మాత్రం వారు చెప్పినవన్నీ ప్రతికూలంగా జరగడం గమనార్హం.