తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం మౌనదీక్ష చేపట్టింది. బాధిత యువతి కథనం ప్రకారం.. మండలంలోని 21 పిట్ ఏరియాకు చెందిన గుడిమళ్ల శ్యాం కుమార్, అదే ఏరియాకు చెందిన తాండ్ర కావ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్యాం ఏడాది నుంచి పెళ్లికి నిరాకరిస్తూ, వాయిదాలు వేస్తూ తప్పించుకుంటున్నాడు. కాగా గతేడాది కట్నం కావాలని కోరగా.. కావ్య ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.
ఈ క్రమంలో తల్లిదండ్రులు రూ. 5 లక్షల వరకు కట్నం ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. అనంతరం క్రమంలో పెళ్లి వాయిదా వేస్తుండగా, పలుమార్లు పంచాయితీలు పెట్టారు. ఈ విషయమై ఎమ్మెల్యే హరిప్రియ దృష్టికి తీసుకెళ్లగా.. పెళ్లి జరిపించేలా చూడాలని మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషాకు సూచించారు. పలు దఫాలు ఆయన శ్యాంకుమార్‌తో చర్చించినా ఫలితం లేదు. దీంతో యువతి ఆందోళనకు దిగింది.
ఆమెకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.శ్రీదేవి, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, టీఎంఆర్‌పీఎస్ నేతలు శ్రీనివాస్, భాగ్య, ఎల్‌హెచ్‌పీఎస్ నేత అజ్మీర శివనాయక్, విజయలక్ష్మి నగర్ సర్పంచ్ ధనసరి స్రవంతి తదితరులు మద్దతు పలికి అండగా నిలిచారు. టీఆర్‌ఎస్ మండల ప్రచార కార్యదర్శిగా ఉన్న శ్యాంకుమార్ తనకు పార్టీ, పోలీసుల అండ ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ కావ్యకు అన్యాయం చేస్తున్నాడని ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.