ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన బుధవారం సాయంత్రం ఆనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆనేకల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన బి.తనూజ(22) ఇదే పట్టణంలోని కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతోంది. తల్లిదండ్రులు మగ్గం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.
సదరు యువతి తాను చదివే కళాశాలలోనే ఓ యువకుడిని ప్రేమించింది. తమకు వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరింది. వారు అంగీకరించకపోవడంతో బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.