ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ సమాచారం మేరకు… సీతాఫల్‌మండీ జోషి కంపౌండ్ ప్రాంతానికి చెందిన పాండుకు నలుగురు కుమార్తెలు. రెండవ కుమార్తె పూజిత (19) ఇంటరీ్మడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది.
అదికాస్తా ప్రేమగా మారి మూడేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని పూజిత తరుచు ఒత్తిడి తెచ్చేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సీతాఫల్‌మండీ ఫ్లైఓవర్ పైకి రావాలని చెప్పడంతో ప్రదీప్ మరో మిత్రునితో కలిసి వచ్చాడు. పూజిత, ప్రదీప్‌లు కొంతసేపు మాట్లాడుకున్నారు. మరోమారు వీరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది.
మరి మరికొన్నాళ్లు ఆగితే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో క్షణికావేశానికిలోనైన పూజిత పరిగెత్తుకుంటూ కొంతదూరం వెళ్లి ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకింది. రాత్రి 11 గంటల సమయంలో పెద్దశబ్ధం రాడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా ఫ్లైఓవర్ కింద రక్తపు మడుగులో యువతి పడుంది. భయకంపితులైన ప్రదీప్, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పూజితను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే పూజిత మృతి చెందింది. పూజిత తండ్రి పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఉస్మానియా మార్చురీలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. పూజిత మృతికి కారణమైన ప్రదీప్‌పై కేసు నమోదు చేశామన్నారు.