యజమాని వేధింపులు భరించలేకే హిమాయత్‌నగర్‌లో మూడు రోజుల క్రితం బాలిక ఆత్మహత్య చేకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఈ నెల 24న బాత్కు మధుయాదవ్(44) ఇంట్లో పనిచేసే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతిచెందిన బాలికతో పాటు ఆమె సోదరి నాలుగేళ్లుగా మధుయాదవ్ ఇంట్లో నెలవారీ జీతానికి పనిచేస్తున్నారు.
ఈ నెల 24వ తేదీన రాత్రి పని ఉందని చెప్పి నిద్రిస్తున్న బాలికను మధుయాదవ్ ఇంట్లోని రెండో అంతస్తుకు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఆమె సోదరి నిద్రలేచి చూసేసరికి బాలిక ఉరి వేసుకుని ఉంది. కడుపు నొప్పితో ఉరి వేసుకుందని చెప్పాలని మధుయాదవ్ బాలిక సోదరిపై ఒత్తిడి చేశాడు. కాగా పోలీసు విచారణలో మధుయాదవ్ వేధింపుల కారణంగానే తన అక్క ఉరి వేసుకుందని ఆమె వెల్లడించింది. దీంతో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం, వేధింపులకు పాల్పడిన కారణంగా మధుయాదవ్‌పై నిర్భయ చట్టం, జువైనల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.
గతంలో కూడా మధుయాదవ్‌పై మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉందని, అతడిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. హోంమంత్రి మహమూద్ అలీ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. విచారణను వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ రంజిత్‌రెడ్డి సీపీ సజ్జనార్‌ను కోరారు.