దేశంలో చిన్నారులు, బాలికలు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కామాంధుల పశుప్రవృత్తి కారణంగా ఎంతో మంది బలైపోతున్న ఉదంతాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మైనర్లు సైతం ఇలాంటి అత్యాచారాలకు పాల్పడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. తాజాగా గుజరాత్లో ఇలాంటి ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. వావి వరసలు మరిచిన ముగ్గురు బాలురు, పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడగా.. ఆమె గర్బం దాల్చింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. నవ్‌సరి జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఐదు నెలల క్రితం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కజిన్ అయిన బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని తన మరో ఇద్దరు కజిన్లతో పంచుకున్నాడు. తనకేమీ భయం లేదని, తన గురించి వాళ్ల అమ్మానాన్నలకు చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించినట్లు చెప్పాడు. దీంతో వారు సైతం బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె భయంతో మిన్నకుండిపోయింది. అయితే కొన్ని రోజుల క్రితం బాలికకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా, ఆమె నాలుగు నెలల గర్భవతి అన్న విషయం బయటపడింది.
దీంతో బుధవారం ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. పోక్సో చట్టం కింద జువైనల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.