జాతీయ స్థాయిలో నీట్‌లో మెడికల్, డెంటల్ రెండు విభాగాల్లోనూ రాష్ట్రంలో అమ్మాయిలే మొదటి స్థానం సాధించారు. పీజీ నీట్–2020లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను పి.శ్యాంప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తో కలిసి ఆయన ఫలితాలు వెల్లడించారు. పీజీ మెడికల్ నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 6,600 మంది అర్హత పొందారని తెలిపారు. పీజీ డెంటల్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి 538 మంది అర్హత సాధించారన్నారు.
అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరతామన్నారు. అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి తుది మెరిట్‌లిస్టు వెల్లడిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వచ్చేవారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాగా, మెడికల్ కౌన్సెలింగ్‌లకు జీవో నెంబర్లు 550, 43 పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన దృష్ట్యా, కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని వీసీ తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు.