సీసా తెచ్చిన సందేశమంటూ శివమణి చిత్రంలో వచ్చే సీన్ గుర్తుంది కదా. సరిగ్గా అలాంటి సీన్ ఒకటి ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. 50 ఏళ్ల కిందట కాగితంపై సందేశం రాసి దాన్ని సీసాలో పెట్టి సముద్రంలో పడేస్తే..ఆ సీసా ఇపుడు సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. వివరాల్లోకి వెళితే..సౌత్ ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో పాల్ ఎలియట్ అనే మత్స్యకారుడు తన కొడుకుతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. అదే సమయంలో పాల్ కు తీరానికి కొట్టుకొచ్చిన ఓ సీసా కనిపించింది.
పాల్ ఆ సీసాలో ఉన్న కాగితాన్ని బయటకి తీసి చదవగా..సుమారు 50 ఏళ్ల కిందట ఆ ఉత్తరం రాసినట్లుగా తేదీతో సహా ఉంది. ఉత్తరం రాసిన వ్యక్తి పాల్ గిబ్బన్ అనే బ్రిటీష్ బాలుడు. అతని వయసు 13 ఏండ్లు ఉంటుంది. ఓ పడవలో పశ్చిమాస్ట్రేలియాలో ఉన్న ప్రెమాంటిల్ నుంచి మెల్ బోర్న్ కు పాల్ గిబ్బన్ ప్రయాణిస్తున్నట్లుగా ఉత్తరంలో ఉందని పాల్ ఎలియట్ వెల్లడించాడు. అంతేకాకుండా ఉత్తరం పెట్టిన సీసాను సముద్రంలో పడేసిన సమయంలో..పాల్ గిబ్బన్ ప్రెమాంటిల్ కు సుమారు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్నట్లు లేఖలో రాసినట్లు పేర్కొన్నాడు.
అయితే సీసా తెచ్చిన సందేశంపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ..సీసా 50 ఏళ్ల నుంచి సముద్రనీటిలో తేలుతూ ఉండే అవకాశం లేదన్నారు. సముద్రంలోని అలలధాటికి తీరానికి కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని, ఆ తర్వాత వర్షాలకు అది ఇసుకపైకి వచ్చి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.