మేమూ మనుషులమే

మేమూ మనుషులమే

‘‘కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా చెత్తగా వాగుతున్నారు. ఇది నిజంగా హేయమైన విషయం. మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయి కనబరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్‌గా ఉండేందుకు ప్రయత్నించండి’’ అంటూ రాయల్‌ చాలెంజర్స్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సీరియస్‌ అయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో తనను, తమ జట్టును విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. అదే విధంగా తమకు అండగా నిలబడ్డ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫైయర్‌-2 ఆడేందుకు అర్హత సాధించగా… కోహ్లి సేన నిరాశగా వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆర్సీబీ ఆటగాళ్లను ముఖ్యంగా మ్యాక్సీ, డేనియల్‌ క్రిస్టియాన్‌ను ట్రోల్‌ చేశారు. క్రిస్టియాన్‌ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో కేకేఆర్‌ ఆటగాళ్లు 22 పరుగులు చేసిన నేపథ్యంలో అతడిని తీవ్రంగా విమర్శించారు.

ఈ విషయాలపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మాక్స్‌వెల్‌… ‘‘ఆర్సీబీకి ఇదొక గొప్ప సీజన్‌. దురదృష్టవశాత్తూ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాం. ఏదేమైనా ఇదొక అద్భుతమైన సీజన్‌. ప్రతీ సమయంలోనూ మాకు అండగా నిలిచి.. మమ్మల్ని ప్రశంసించిన నిజమైన అభిమానులకు ధన్యవాదాలు!! అయితే, దురదృష్టవశాత్తూ కొంత మంది భయంకర మనస్తత్వాలు గల వ్యక్తులు సోషల్‌ మీడియాలో చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు!! వాళ్లలా మాత్రం ఉండకండి’’ అని ట్రోల్స్‌కు ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా ఈ ఏడాది ఆర్సీబీ తరఫున బరిలో దిగిన మాక్సీ 513 పరుగులు చేశాడు. ఇక సోమవారం నాటి మ్యాచ్‌లో అతడు.. 18 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు.