షాక్ లో ఉన్న ఎన్టీఆర్‌

షాక్ లో ఉన్న ఎన్టీఆర్‌

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ, ఈ‍స్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూసర్‌ మహేశ్‌ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్‌ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.

అలాగే మహేశ్‌ మృతిపై జూ. ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ. ‘బరువెక్కిన గుండెతో నాకు మాటలు రావడం లేదు. నా స్నేహితుడు మహేశ్‌ కోనేరు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ఎన్టీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా మహేశ్‌ ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు, కల్యాణ్‌ రామ్‌లకు పీఆర్‌ఓ వ్యవహరిస్తున్నారు.

అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత ‘118, మిస్‌ ఇండియా, తిమ్మరుసు’ వంటి చిత్రాలను నిర్మించి నిర్మాత కూడా మారారు. నిర్మాతగా కెరీర్ కొనసాగిస్తున్న మహేష్ కోనేరు హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీ సైతం షాక్‌కు గురైయింది. ఆయన మరణ వార్త తెలిసి టాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. మొదట ఒక సాధారణ జర్నలిస్ట్‌గా తన కెరీర్ మొదలు పెట్టిన మహేశ్‌ ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్‌గా ఎదిగారు.