మృతదేహమై ఒడ్డుకు చేరాడు

మృతదేహమై ఒడ్డుకు చేరాడు

స్నేహితులతో చెరువుకు వెళ్లిన కుర్రాడు మృతదేహమై ఒడ్డుకు చేరాడు. గార, లావేరు మండలాల్లో జరిగిన ఈ ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మండలంలోని కేశవరాయునిపురం గ్రామంలో చెరువులో మునిగి అదే గ్రామానికి చెందిన ఇనపకుర్తి సూర్య(12) సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన సూర్య లావేరు హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉన్న విద్యార్థి అదే గ్రామానికి చెందిన మరో నలుగురు విద్యార్థులతో సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గ్రామంలోని ఎర్ర చెరువులో స్నానానికి వెళ్లాడు.

ఇటీవలే ఆ చెరువులో జేసీబీతో మట్టి తీశారు. స్నానానికి దిగిన సూర్య లోపలకు వెళ్లి ఆ గోతుల్లో చిక్కుకుని మునిగిపోయాడు. మిగిలిన విద్యార్థులు భయపడి ఇళ్లకు వచ్చేశారు. రాత్రి 7 గంటలు దాటినా సూర్య ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకగా.. విద్యార్థి చెరువుకు వెళ్లాడని తెలిసింది. అంతా కలిసి చెరువుకు వెళ్లి గాలించగా సూర్య మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కుమారుడు ఇలా పన్నెండేళ్లకే చనిపోవడంతో తల్లిదండ్రులు రమేష్, రాణి దంపతులు గుండెలవిసేలా రోదించారు.