చైనా మీడియా భారత్ పై విమర్శలు చేయడం ఒక్కటే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. భారత్ చైనా మధ్య డోక్లామ్ ప్రతిష్టంభన సాగినన్నాళ్లూ ఏదో ఓ రూపంలో నిత్యం భారత్ పై విమర్శలు చేస్తూ వచ్చింది ఆ దేశం. డోక్లామ్ వివాదం ముగిసిన తర్వాత కూడా కొన్నాళ్లు ఆ సమస్యను ఏదో రూపంలో ప్రస్తావిస్తూ భారత్ ను ఆడిపోసుకుంది. తర్వాత జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటనే లక్ష్యంగా కొన్నాళ్లు విమర్శలు, వ్యంగ్యవ్యాఖ్యలు చేసింది. ఇప్పుడిక మళ్లీ పాకిస్థాన్ కు మద్దతుగా రాగం ఎత్తుకుంది. పాకిస్థాన్ తీరును ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ఎండగట్టింది.
భారత్ ఐటీ పవర్ గా ఎదిగితే… పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎగుమతి చేసే దేశంగా తయారయిందని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఐరాసలో చేసిన ప్రసంగంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కానీ పాక్ మిత్రదేశం హోదాలో ఉన్న చైనా మాత్రం ఎప్పటిలానే భారత్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సుష్మా ప్రసంగంపై చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రత్యేకంగా సంపాదకీయం రాసింది. సుష్మ పాక్ ను ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్న దేశంగా అభివర్ణించడం రాజకీయంగా అసంబద్ధమైన చర్యగా పేర్కొంది. ఈ విమర్శలు భారత పాలకుల రాజకీయ దుర్భల మనస్తత్వానికి, అసంబద్ధతకు నిదర్శనమని గ్లోబల్ టైమ్స్ విమర్శించింది. ఇంతటితో ఆగలేదు ఆ పత్రిక. .టెర్రరిజానికి సంబంధించి పాక్ వైఖరిపై గ్లోబల్ టైమ్స్ చేసిన ఓ వ్యాఖ్య చూస్తే… ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పాక్ సర్శశక్తులూ ఒడ్డుతోందని, వారి చారిత్రక వివాదాలతో టెర్రరిజాన్ని కలగాపులగం చేయొద్దని వ్యాఖ్యానించడం ద్వారా… మరోమారు చైనా పాకిస్థాన్ విషయంలో తన వైఖరిని తేటతెల్లం చేసింది.