కెనడాలో నివసిస్తున్న హిందువులకు ప్రాణభయం పట్టుకుంది. అక్కడి హిందువులకు బెదిరింపులు వస్తున్నాయి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పా టువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ.. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. కెనడా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోన్న కొంతమంది ఇండో- హిందువులు.. కెనడా పట్ల నిబద్ధతను చాటడం లేదని గురుపత్వంత్ చెబుతున్నట్లున్న వీడియో వైరల్‌గా మారింది.
దీనిపై అక్కడి సర్కార్ స్పందించింది. తమ దేశంలో ద్వేషం, అభద్రత, భయాలకు చోటు లేదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ.. పరస్పరం గౌరవించుకుంటూ చట్టాలను పాటించాలని కెనడా ప్రజా భద్రతా విభాగం సూచించింది. తమ దేశంలో అన్ని మతాల పౌరులకు భద్రత ఉంటుందని స్పష్టం చేసింది.
మరోవైపు ఖలిస్ధానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని ఇటీవలే కెనడా ప్రధాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కెనడా గడ్డపై ఒక కెనెడియన్‌ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారనడానికి తమవద్ద విశ్వసనీయ కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో దర్యాప్తునకు భారత్ సహకరించాలని.. పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయాన్ని నిర్ధరించడానికి తమతో కలిసి పనిచేయాలని భారత్‌కు ప్రధాని ట్రూడో కోరారు.