దేవుడు మనకు సైలెంట్ పార్టనర్ అని తెలుసా.

God is a Silent partner to us

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆధ్యాత్మిక వాదులకి, భక్తులకి, ఆస్తికులకి  తరచుగా ఎదురయ్యే ప్రశ్న ఒకటుంది…దేవుడిని మీరు చూసారా అని ? దేవుడిని నమ్ముకున్నందుకు మీకేమి చేసాడని అడుగుతుంటారు. నిజంగా ఈ ప్రశ్నలకి ఇచ్చే సమాధానాలు ఏ నాస్తికుడికి నమ్మకం కలిగించలేవు. ఏ ఆస్తికుడికి సంతృప్తి కలిగించలేవు. ఈ ప్రశ్నలు నాస్తికుడిని మాత్రమే కాదు ఒక్కోసారి ఆస్తికుడిని కూడా వేధిస్తాయి. కష్టం వచ్చినప్పుడో, ఇంకో సందర్భంలోనో అంతా అయోమయం అనిపిస్తుంది. దైవం మన వెన్నంటి లేడేమో అన్న భయం కలుగుతుంది. ఇలాంటి సందర్భం అర్జునుడుకి కూడా వచ్చింది. అర్జునుడి ప్రస్తావన రాగానే అందరూ కురుక్షేత్ర సమయంలో ఆయన ద్వైదీభావం గురించి అనుకుంటారు. కానీ అంతకుముందే అర్జునుడికి అంతా తానే చేస్తున్నప్పుడు దేవుడు గా కృష్ణుడికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలన్న చిన్నపాటి సంశయం తలెత్తింది. కొద్దిపాటి అహం తలెత్తింది. ఆ సంశయం, అహం కృష్ణుడు ఇచ్చిన ఓ చిన్నపాటి సమాధానంతో దూదిపింజలా ఎగిరిపోయింది. 

ద్రౌపది స్వయంవరానికి అర్జునుడు వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న పరీక్ష ఏమిటో లోకమంతా తెలిసిందే. ఓ స్థంభం మీద బద్ధ పై అటుఇటు కదలాడుతున్న చేపని నేరుగా కాకుండా కిందవున్న నీటి లోని ప్రతిబింబం చూసి కొట్టడమే ఆ పరీక్ష. ఈ పరీక్షలో అర్జునుడు గెలుపొంది ద్రౌపది ని దక్కించుకోవడం అందరికీ తెలుసు. ఆ పరీక్షకి ముందు రోజు రాత్రి ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. 
రేపటి పరీక్షలో ఎలా నెగ్గాలి అన్నదానిపై కృష్ణార్జునులు చర్చించుకుంటున్నారు. అర్జునుడు బాగా ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇంతలో కృష్ణుడు “ అర్జునా …జాగ్రత్తగా విను. ఓ అడుగు ముందుకేసి మోకాటి మీద కూర్చో . బాణం వేయబోయే ముందు దృష్టి అంతా చేప కన్ను మీదే వుంచు” అని చెప్పాడు. తన ఒత్తిడిలో తానుంటే ఏదైనా అద్భుతం చేయకుండా ఇలాంటి సలహాలు చెప్తున్నాడని కృష్ణుడు మీద అర్జునుడుకి కాస్త అసహనం కలిగింది. అందుకే ఏ మాత్రం సంకోచించకుండా “ అంతా నేనే చేస్తుంటే,మీరు ఏమి చేస్తారు ?” అని కృష్ణుడు ని అర్జునుడు ప్రశ్నించాడు. అర్జునుడి ఉక్రోషం, అసహనం అర్ధం చేసుకున్న కృష్ణుడు చిరునవ్వుతో,సుతిమెత్తటి స్వరంతో ఇలా అన్నాడు …” చేప ప్రతిబింబం కనిపించే నీటిని స్థిరంగా ఉంచేలా చేస్తాను” అని కృష్ణుడు ఇచ్చిన సమాధానంతో అర్జునుడి కళ్ళు తెరుచుకున్నాయి. దేవుడు మనతో ఎలా భాగస్వామి అవుతాడో అర్ధం చేసుకున్న అర్జునుడు కృష్ణుడిని క్షమాపణ అడిగాడు. తిరిగే చేపని చూడడానికి నీళ్లు స్థిరంగా ఉండటం ఎంత అవసరమో అర్జునుడికి వెంటనే అర్ధం అయ్యింది కాబట్టి కృష్ణలీల తెలిసింది. మనలో చాలా మందికి ఆ విషయం అర్ధం కావడం లేదు కాబట్టే ఆ దేవుడి భాగస్వామ్యాన్ని తెలుసుకోలేకతున్నాం.