కృష్ణాష్టమి విశిష్టత…

lord krishna janmashtami

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ”కృష్ణాష్టమి” గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని “గోకులాష్టమి”, “అష్టమి రోహిణి”, “శ్రీకృష్ణ జన్మాష్టమి”, “శ్రీకృష్ణ జయంతి”, “శ్రీ జయంతి”, “సాతం ఆతం”, “జన్మాష్టమి” – ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. కృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినముశ్రీకృష్ణుని జన్మదినమైన అష్టమి రోజున జరుపుకునే కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగ అని కూడా అంటారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు.

పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.

మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే ‘శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం.
ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. “కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి” అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.

కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు.

కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది.

కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.

మరిన్ని వార్తలు:

నంద్యాల ఫలితాన్ని బట్టే కమలం నిర్ణయం

మోడీ మాట బాబా చెప్పారా..?

పొలిటికల్ స్క్రీన్ పై అంజలి