వృద్ధురాలి మెడలోంచి బంగారం గొలుసు చోరీ

వృద్ధురాలి మెడలోంచి బంగారం గొలుసు చోరీ

ముషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి, మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన ద్వయం శక్తి మయూర్, కాలా వికాస్‌ విచారణలో మరో నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శక్తి మయూర్‌ ప్రోద్బలంతో ఈ ద్వయం స్నాచింగ్‌ చేసిన మరుసటి రోజు మరో ఇద్దరితో కలిసి అఫ్జల్‌గంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ బార్‌లో చోరీ చేసినట్లు తేలింది. మయూర్,వికాస్‌లను సోమవారం అరెస్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈ విషయం గుర్తించింది. దీంతో మంగళవారం మిగిలిన ఇద్దరు నిందితుల్నీ పట్టుకుంది. వీరిని తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఇప్పటికే ముషీరాబాద్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించిన మయూర్‌ను ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు.

పురానాపూల్‌లోని ఎస్వీనగర్‌కు చెందిన శక్తి మయూర్‌ తారామండల్‌ కాంప్లెక్స్‌లోని ఓ ప్రైవేట్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పదో తరగతి వరకు గజ్వేల్‌లో చదివిన ఇతగాడు ఆపై చదువుకు స్వస్తి చెప్పి సిటీకి వచ్చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చెడు వ్యసనాలకు లోనయ్యాడు. స్నేహితులతో కలిసి జల్సాలు చేయడానికి అలవాటుపడ్డాడు. మద్యం, జూదం తదితర వ్యసనాలకు బానిసైన ఇతగాడికి పురానాపూల్‌కు చెందిన కాలా వికాస్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి సంచరించడం మొదలెట్టారు. వీరికి తాము చేస్తున్న ఉద్యోగాల్లో నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వచ్చేది.

వ్యసనాలకు బానిసలైన వీరికి ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో తేలిగ్గా డబ్బు పంపాదించడానికి నేరాలు చేయాలని శక్తి మయూర్‌ పథకం వేశాడు. దీనికి వికాస్‌ కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మధ్య మండల పరిధిలోని అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. రెండుమూడు రోజుల పరిశీలన అనంతరం ముషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో స్నాచింగ్‌ చేయడం అనువని గుర్తించారు. దీంతో ఈ నెల 7న తమ వాహనంపై మరోసారి అక్కడికి వెళ్లారు. వాకింగ్‌కు వచ్చిన పార్వతిదేవి అనే వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ముషీరాబాద్‌ ఠాణాలో కేసు నమోదైంది.