ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడితో బంగారం భగ్గుమంటోంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేరుగా దేశీయ బులియన్ మార్కెట్‌పై పడింది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలతో పాటు.. బంగారం ధరలు పెరిగాయి. ఈ పరిస్థితులతో ఈ ఏడాది చివరి వరకు బంగారం ధరలు దేశీయ మార్కెట్లో రూ.58 వేలను దాటి పోనుందని కేడియా అడ్వయిజరీ డైరెక్టర్ అజయ్ కేడియా తెలిపారు. ఒకవేళ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారితే.. ఈ యెల్లో మెటల్ రూ.60 వేలను మించిపోనుందని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధ భయాందోళనలకు దారితీస్తున్నాయి. ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఒడిదుడుకులలో ఉన్న మార్కెట్లు.. నేడు రష్యా దాడి ప్రకటనతో తీవ్రంగా పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈక్విటీలను వదిలేసి, బంగారం వైపుకి మరలుతున్నారు. బంగారం భవిష్యత్ బాగుంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మార్చి 31, 2022 నాటికల్లా దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,500ను టచ్ చేస్తుందని తెలుస్తోంది.
రాజకీయ భౌగోళిక పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో.. ఎంసీఎక్స్‌లో గోల్డ్ 2.15 శాతం పెరిగి రూ.51,750కి చేరుకుంది. నేటి ట్రేడింగ్‌లో గోల్డ్ రూ.1300 వరకు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఒక్కో ఔన్స్ 1950 డాలర్లకు పెరిగాయి. సురక్షితమైన పెట్టుబడులతో.. ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి బయటకి వచ్చి, గోల్డ్‌ను కొనుగోలు చేస్తున్నారు.దాడి ప్రభావంతో బంగారం మాత్రమే కాక, సిల్వర్ కూడా 2 శాతం లాభపడింది. క్రూడ్ 5 శాతానికి పైగా పెరిగింది. బ్యారల్ 101 డాలర్లను క్రాస్ చేసింది. రూపాయి వాల్యు డాలర్ మారకంలో 0.59 శాతం పడిపోయింది. నేచురల్ గ్యాస్ ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. అల్యూమినియం 2 శాతం పెరిగింది.