హైదరాబాద్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న ఇళ్ల ధరలు

కరోనా దెబ్బకు ఆర్థిక రంగం బాగా కుదేలైంది. దీంతో లావాదేవీలు భారీగా పడిపోయాయి. ఆర్థికంగా ఎటూ పోలేని ఏమీ చేయలేని పరిస్థతి. ఇదే సమయంలో సామాన్యుడికి కొన్నింటిలో కొంత కలిసొచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్నాళ్లనుంచో ఇళ్లు కొనాలని ఉండి వేచి చూస్తున్న వారికి లాక్ డౌన్ కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. నిజంగా మీరు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి వార్తే. ఇళ్ల ధరలు భారీగా దిగొచ్చాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది.

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇళ్ల అమ్మకాలు పడిపోవడం అంటే డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దేశంలోని ఎనిమిది కీలక పట్టణాల్లో ఏప్రిల్ నెలలో ఇళ్ల ధరలు 2 నుంచి 9 శాతం వరకు పడిపోయాయి. రియల్ ఎస్టేట్ పోర్టల్ మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. అసలు విషయం ఏమిటంటే.. లాక్ డౌన్‌లో 8 టైర్ 1 పట్టణాల్లో సగటున ప్రాపర్టీ ధరలు 4 శాతం మేర దిగొచ్చాయి. మార్చ 15 నుంచి ఏప్రిల్ 15 మధ్య కాలంలో ప్రాపర్టీ ధరల్లోని వ్యత్యాసాన్ని ఈ నివేదిక వెల్లడించింది.

అందులో భాగంగా గత ఏడాది ఏ ధరలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా రేట్లు దాదాపు అదే స్థాయికి తగ్గాయని మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక తెలిపింది. గరిష్టంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఏకంగా 9 శాతం దిగిరావడం నివేదిక ద్వారా స్పష్టమౌతుంది. కాగా బెంగళూరులో ధరలు 5శాతం, కోల్‌కతాలో 4 శాతం, చెన్నైలోనూ 4 శాతం, ఢిల్లీలో 3 శాతం, ముంబైలో 2 శాతం, పుణేలో 2 శాతం చొప్పున ఇళ్ల ధరలు తగ్గాయి. అదేవిధంగా ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా వెల్లడైంది. ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారి విషయానికి వస్తే.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంటి కొనుగోలు ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు. లేదంటే ఇల్లు కొనడానికి మొగ్గు చూపడం లేదు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేయాలనుకొనేవారి సంఖ్య కూడా భారీగానే తగ్గుతుంది. దీంతో ఇళ్ల ధరలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.