యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ 2’ ఎట్టకేలకు గురువారం విడుదలైంది. కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. అయితే ‘కేజీఎఫ్2’కి చివరిలో కొనసాగింపుగా ‘కేజీఎఫ్3’ కూడా ఉండబోతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అలానే అందులో ఈ సారి స్టోరీ ఎక్కడ జరగబోతుందో కూడా చెప్పేశారనే చెప్పాలి. ఇంతవరకూ ఇండియాలోనే జరిగిన ‘కేజీఎఫ్’ కథ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని సమాచారం. అందుకే ‘కేజీఎఫ్ 2’ చిత్రం చివరిలో రాకీభాయ్ వస్తుంటే.. అతడి షిప్ను అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడుతున్నట్టు చూపించారు. రాకీభాయ్ సామ్రాజ్యం విదేశాలలో కూడా విస్తరించినట్లు చూపించారు.
దాంతో పాటు రాకీ మీద భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్లు ఉంటుంది.వీటిని చూసిన సిని ప్రేక్షకులు ‘కేజీఎఫ్’కి పార్ట్ 3 కూడా రాబోతోందని నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్’ రెండు భాగాలుగా రానున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం ఓ కొలిక్కి వచ్చిన తరవాత ‘కేజీఎఫ్’ పార్ట్ 3 పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది.