ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హోంగార్డులకు తీపికబురు చెప్పారు. హోంగార్డుల వేతనాల్ని రూ.18వేల నుంచి రూ.21వేలకు పెంచారు. అంతేకాకుండా ఒక వేళ ఎవరైనా హోంగార్డు విధి నిర్వహణలో చనిపోతే… వారికి రూ.5లక్షల నష్టపరిహారం కూడా అందిస్తామన్నారు. పోలీస్ సిబ్బందికి బీమా సౌకర్యం రూ.40లక్షల వరకు కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. రిటైర్డ్ పోలీసులకు కూడా బీమా వర్తిస్తుందన్నారు.
అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం సీఎం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి పగలు తేడాలేకుండా విధులు నిర్వహించే పోలీసులు బాధ్యతల నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతుంటారన్నారు. అటువంటి వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు. పోలీసులు ఒక్కరోజైనా వారి కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకే వారికి కూడా వీక్లీ ఆఫ్లు కల్పించామన్నారు.