హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్

హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్

హైదరాబాదీలకు టీఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది.. ఇప్పటికే రూ.100 చార్జీతో రోజంతా.. హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా టీ24 టికెట్‌ను తెచ్చిన ఆ సంస్థ.. ఇప్పుడు హైదరాబాద్‌లో వేకువజాము నుంచే బస్సులను తిప్పాలని కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నగరంలోని సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ల నుంచి తెల్లవారు జామునే బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సుల్లో ప్రయాణించి రద్దీని అంచనా వేసి అవసరమైన మేరకు బస్సులను పెంచేందుకు కసరత్తు చేశారు.

హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల నుంచి ఉదయం 4 గంటలకే అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు బయలుదేరుతున్నాయని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. హయత్‌నగర్‌, ఫలక్‌నుమా, హెచ్‌సీయూ, మియాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌, జీడిమెట్ల, చెంగిచర్ల, మిధాని, మెహిదీపట్నం డిపోల నుంచి కూడా తెల్లవారుజామునే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.

అలాగే రాత్రి కూడా 10 గంటల వరకు కూడా ఆ బస్సులకు షెడ్యూల్‌ వేశామన్నారు.ఇక విద్యాసంస్థలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు అనువుగా ఉండేలా టీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సులను కూడా పెంచింది. హయత్‌నగర్‌-కోఠి మధ్య రోజూ తిరిగే బస్సులకు అదనంగా మరో 12 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. బుధవారం నుంచి అదనంగా బస్సులను నడుపుతున్నారు.