ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. ఆపిల్ సంస్థ ప్రతినిధులు ‘ఐఫోన్13 సిరీస్’ విడుదల తేదీని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.
చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ 30న ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది’ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ తో పాటు ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లను సెప్టెంబర్ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని విడుదల చేయనుంది. అధికారికంగా ఐఫోన్ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్ మాత్రం సెప్టెంబర్ 17న విడుదల చేస్తుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ప్రతిసారి ఆపిల్ ప్రాడక్ట్ తేదీ విడుదల ఎప్పుడనే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్ని ఖండించని ఆపిల్ సంబంధిత తేదీల్లోనే విడుదల చేయడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఊతమిచినట్లైంది.