మందుబాబులకు శుభవార్త

మందుబాబులకు శుభవార్త

ఇప్పటివరకు ఫుడ్‌ డెలివరీ, నిత్యావసర సరుకుల డోర్‌ డెలివరీ మాత్రమే తెలుసు. అయితే ఢిల్లీ ప్రభుత్వం కొత్త పద్ధతికి తెర లేపింది. ఇక నుంచి మద్యాన్ని ఇంటికే పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలు ఢిల్లీలో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.మద్యం విక్రేతలు మద్యాన్ని డోర్‌ డెలివరీ చేయడానికి నిబంధనల ప్రకారం ఎల్ -13 లైసెన్స్ కలిగి ఉండాలి.

కాగా ఎల్‌-13 లైసెన్స్‌ కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మద్యం ఇంటికి ఆర్డర్ చేసుకునే ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. మద్యం విక్రేతలకు ఎల్ -13 లైసెన్స్ జారీ చేసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది.ఢిల్లీ ప్రభుత్వం జూన్ 1న ఎక్సైజ్ నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే. భారతీయ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని మొబైల్ యాప్స్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్స్ ద్వారా ఇంటికి పంపిణీ చేయడానికి అనుమతించింది.

అయితే మద్యాన్ని నేరుగా ఇంటికే పంపిణీ చేయాలని పేర్కొంది. హాస్టల్స్‌, కార్యాలయాలు, సంస్థలకు డెలివరీ చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 19న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి మద్యం షాపులు, మాల్స్, మార్కెట్లు మూసివేశారు.