సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాతున్నాడు. సినిమాలతోనే కాదు సేవాగుణంతోనూ కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా మారాడు. తోటి వారికి కష్టాలు వస్తే.. తనకు చేతనైనంతవరకు సాయం అందిస్తున్నాడు.
సినిమాల విషయంలో కూడా మహేశ్ ఇదే ఫాలో అవుతాడట. తన సినిమాల వల్ల ఎవరికైనా నష్టం వాటిల్లితే వెంటనే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారట మహేశ్ బాబు. ఈ విషయాన్ని అభిషేక్ ప్రొడక్షన్స్ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రమే తన సినిమా వల్ల నష్టం వచ్చిన వారికి డబ్బులు వెనక్కిచ్చి ఆదుకుంటారని అన్నారు.
‘సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించక ఎవరైనా నిర్మాత నష్టపోతే పిలిచి అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు మహేశ్ బాబు. అంతేకాకుండా తర్వాతి సినిమా ఆయనతో చేసినా, చేయకపోయినా ప్రొడక్షన్ హౌస్‌తో సంబంధం లేకుండా డబ్బు ఇచ్చేస్తారు. టాలీవుడ్‌లో ఆయన ఒక్కడే ఇలా చేస్తుంటారు. ప్రొడ్యుసర్, నిర్మాత నష్టపోతున్నాడంటే మహేశ్ బాబు ఊరుకోలేరు. నష్టం వస్తే మనీ వెనక్కి ఇవ్వడమే కాకుండా తరువాత సినిమాలు ఇప్పిస్తాడు’అని అభిషేక్ అన్నాడు.
అభిషేక్ విషయానికి వస్తే.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అత్తారింటి దారేది’, ‘వరుడు’ ‘హార్ట్ ఎటాక్’, ‘మనం’, కుమారి 21 ఎఫ్’, లోఫర్, రుద్రమదేవి, శ్రీమంతుడు, కబాలి, బ్రహ్మోత్సవం, సుప్రీమ్, వరల్డ్ ఫేమస్ లవర్, ఇస్మార్ట్ శంకర్‌తో పాటు వందలాది తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అలాగే ‘బాబు బాగా బిజీ, కేశవ, సాక్ష్యం, గూడఛారి వంటి చిత్రాలను నిర్మాతగా వ్యవహరించాడు.