గూఢచారి మూవీ : తెలుగు బుల్లెట్ రివ్యూ

goodachari movie review

నటీనటులు:అడివి శేష్‌, శోభితా దూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్‌
సంగీతం : శ్రీచరణ్‌ పాకల
దర్శకత్వం : శశి కిరణ్ తిక్క
నిర్మాత : అభిషేక్‌ నామా, విశ్వప్రసాద్‌,

అడివిశేష్ సినిమా అనగానే ఎక్కడో ఏదో స్పెషల్ ఉంటుంది అనుకునే మూడ్ తెలుగు ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన క్షణం చూసాక ఆ నమ్మకం బలపడింది. ఇప్పుడు అవే అంచనాల మధ్య ఆయన హీరో పాత్రతో పాటు రచయితగా కూడా సహకారం అందించిన గూఢచారి ప్రొడక్షన్ దశలోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసిన గూఢచారి ఎలా వుందో చూద్దాం.

goodachari movie

కధ…

గూఢచారి సినిమాల్లో కధ ఏముంటుంది అని సాధారణంగా వుండే అభిప్రాయం. దాన్ని ఈ సినిమాతో బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. అర్జున్ (అడవి శేష్ )చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. దేశం తరపున త్రినేత్ర అనే సీక్రెట్ ఆపరేషన్ లో తండ్రి చనిపోయిన అర్జున్ ని మామయ్య (ప్రకాష్ రాజ్ ) పెంచి పెద్ద చేస్తాడు. తండ్రితో పాటు అదే ఆపరేషన్ లో పాల్గొన్న మామయ్య ని అర్జున్ తండ్రిగా భావించి డాడ్ అని పిలుస్తుంటాడు. అయితే తండ్రి లాగే దేశం కోసం ఏదైనా చేయాలి అనుకునే అర్జున్ ని మామయ్య ఆ ప్రయత్నం వద్దని వారిస్తుంటాడు. అయినా వినకుండా పదేపదే ప్రయత్నించి త్రినేత్ర అనే స్పెషల్ మిషన్ కోసం ఎంపిక అవుతాడు. ఆ శిక్షణ టైం లోనే ఎదురింటిలో దిగిన ఓ సైకాలజిస్ట్ ప్రేమలో పడిన అర్జున్ అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకుంటాడు . త్రినేత్ర కి బీజం వేసిన ఆచారి తో పాటు కొందరు కీలక సభ్యులు హత్య కి గురి అవుతారు. అర్జున్ ప్రియురాలిని కూడా చంపేస్తారు. ఆ నేరం అర్జున్ మీద పడుతుంది. అసలు ఈ నేరం చేసింది ఎవరు ? అర్జున్ ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కధ.

goodachari Telugu movie

విశ్లేషణ …

కొత్త కొత్త కధలు , కధనాలు ఈ తరం ప్రేక్షకులు ఆదరిస్తున్న తరుణంలో వచ్చిన గూఢచారి గెలుపు , ఓటములతో సంబంధం లేకుండా చేసిన ఓ మంచి ప్రయత్నం. సహజంగా భారతీయ సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ ప్రభావం ఉన్నప్పటికీ ఆ తరహా కధల్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. గూఢచారి కూడా అదే తరహాలో ఉంటుంది అనుకుంటే ఫస్ట్ హాఫ్ చూస్తే అంతకు మించి అనిపించింది. తొలి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ బాంగ్ పడేదాకా ఎక్కడా ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేదా అన్నంత బిగువుగా కధనం నడిచింది. గూఢచారి సినిమాల్లో సహజంగా ఏజెంట్ ఆపరేషన్ గురించి హైలైట్ చేస్తారు. ఇక్కడ మాత్రం ట్రైనింగ్ కూడా చూపించడం ఆసక్తిగారంగా మారింది. ఇక ఇందులో లవ్ ఎపిసోడ్ కూడా బాగా మిక్స్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ , ఇంటర్వెల్ బ్యాంగ్స్ తో ప్రేక్షకుడి ఊహలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఏదో హాలీవుడ్ చూస్తున్నాం అన్నంత ఫీలింగ్ వచ్చింది. మెయిన్ విలన్ ( జగపతిబాబు )ఎంట్రన్స్ తో ఇంకా ఆసక్తి పెరిగింది. అయితే సెకండ్ హాఫ్ లో చిట్టగాంగ్ ఎపిసోడ్ ఎప్పుడైతే మొదలు అయ్యిందో , ప్రేక్షకుడు ఊహలకు తగ్గట్టుగా లేదు అనిపించింది. తీయడంలో లోపం లేకపోయినా ప్రేక్షకుడి అంచనాలు అందుకోలేకపోయారు దర్శకుడు శశికిరణ్ తిక్కా. ఇక ఆపై ఎన్నో ఇండియన్ , తెలుగు సినిమాల్లో కనిపించే సెంటిమెంట్ , మలుపులు వచ్చి గూఢచారి ఫ్లేవర్ ని దెబ్బతీశాయి .

gudachari film

తెలుగు సినిమా చేస్తున్నాం అన్న స్పృహతో తీసుకున్న ఈ జాగ్రత్తలు గూఢచారి స్థాయిని కాస్త తగ్గించాయి. ఫస్ట్ హాఫ్ ని మించిన సీన్స్ లేని లోటు సెకండ్ హాఫ్ లో బాగా కనిపించింది. గొప్ప స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్న హీరో ఆ స్థాయిలో టెక్నాలజీ , వెపన్స్ వాడడం కాకుండా బుర్రకు పనిపెట్టే ఎపిసోడ్స్ ఉండి ఉంటే బాగుండేది. ఆ లోపం సెకండ్ హాఫ్ తో పాటు క్లయిమాక్స్ లో బాగా కనిపించింది.అడివి శేష్ హీరోగా బాగా చేసాడు. అయితే గూఢచారి పాత్రకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ లో ఇంకాస్త వేగం ఉంటే బాగుండు అనిపించింది. ఇక ప్రకాష్ రాజ్ , జగపతిబాబు , వెన్నెల కిషోర్ , అనీష్ కురువిల్లతో పాటు యార్లగడ్డ సుప్రియ స్క్రీన్ ప్రెజన్స్ సూపర్ . హీరోయిన్ , సెకండ్ హీరోయిన్ పాత్రలు బాగా చేశారు. రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో నటీనటుల నుంచి హావభావాలు రాబట్టడంలో దర్శకుడు శశి ప్రతిభ ని మెచ్చుకోవాలి. అయితే సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమాతో అతను టాప్ చైర్ లో కూర్చుంటాడు అని చెప్పే స్థాయి . కెమెరా , మ్యూజిక్ సూపర్. మొత్తానికి అంచనాలు పెంచి కాస్త దూరంలో ఆగిపోయాడు గూఢచారి.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … గూఢచారి టార్గెట్ కి సెంటిమెంట్ అడ్డం పడిందా ?
తెలుగు బులెట్ రేటింగ్ … 2 .75 /5 .