నా రాజ‌కీయాల రంగు కాషాయం కాదు…న‌లుపు

goodbye movies says kamal Haasan after his political debut

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌జాసేవ‌లోనే తాను ప్రాణాలు విడ‌వాల‌నుకుంటున్నాన‌ని ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స్ప‌ష్టంచేశారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న రెండు సినిమాల త‌ర్వాత ఇక తాను న‌టించ‌బోన‌ని తేల్చిచెప్పారు. బోస్ట‌న్ లోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ఇండియా టుడే న్యూస్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కమ‌ల్ హాస‌న్ భ‌విష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ వెల్ల‌డించారు. త‌న‌కు సంపాద‌న ఉంద‌ని, బ్యాంకు బాలెన్స్ పెంచుకోవాల‌నుకోవ‌డం లేద‌ని, సంతోషంతో ప్ర‌శాంత‌మైన రిటైర్మెంట్ జీవితం గ‌డ‌ప‌గ‌లిగిన‌ప్ప‌టికీ… తాను న‌టుడిగా చ‌నిపోద‌లుచుకోలేద‌ని క‌మ‌ల్ వ్యాఖ్యానించారు. చివ‌రి వ‌ర‌కూ ప్ర‌జాసేవ‌లో కొన‌సాగేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాని తెలిపారు.

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లకోసం రాజ‌కీయాల్లోకి రావాల‌ని తీసుకున్న నిర్ణ‌యమే అంతిమ‌మ‌ని, వెన‌క్కి త‌గ్గేది లేద‌ని అన్నారు. ఈ నెల‌లో పార్టీ, సిద్దాంతాల‌ను ప్ర‌క‌టిస్తాన‌న్నారు. ఓట‌మి ఎదురైనా రాజ‌కీయాల్లో కొన‌సాగుతారా అన్న ప్ర‌శ్న‌కు నిజాయితీగా జీవించేందుకు ఏదైనా చేయాల‌నుకుంటున్నాన‌ని బ‌దులిచ్చారు. తానేమీ ఓడిపోతాన‌నుకోవ‌డం లేద‌ని, త‌న‌కు రాజ‌కీయ సంస్థ లేక‌పోయినా 37 ఏళ్లుగా సామాజిక సేవ‌లో ఉన్నాన‌ని, ప‌దిల‌క్ష‌ల మంది న‌మ్మ‌క‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించానని క‌మ‌ల్ తెలిపారు. త‌న రాజ‌కీయాలు కాషాయ భావ‌జాలానికి వ్య‌తిరేక‌మే అని క‌మ‌ల్ మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. కాషాయం అంటే త‌న‌కు ఆందోళ‌న‌క‌ర‌మ‌ని, త‌న రాజ‌కీయాలు న‌లుపు రంగులోనే ఉంటాయ‌ని, అది ద్ర‌విడుల స్వ‌రం, చ‌ర్మ‌త‌త్వాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ర‌జనీకాంత్ రాజ‌కీయాలు కాషాయ‌మైతే ఎలాంటి కూట‌మి క‌ట్టేది లేద‌ని క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యానించారు.