తెలుగు వెబ్సైట్ల నిర్వాహకులకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. గూగుల్ యాడ్స్ లో మెయిన్ అయిన యాడ్ వర్డ్స్, యాడ్ సెన్స్లలోని సాంకేతికతను ఇక పై తెలుగు ప్రకటనలకు కూడా అందించనున్నట్టు ప్రకటించింది . ఇప్పటికే ప్రాంతీయ భాషలైన హిందీ, బెంగాలీ, తమిళం భాషల వెబ్సైట్లకు ఈ వెసులుబాటు ఉండగా ఇప్పుడు వాటితో పాటు తెలుగులో కూడా ఈ సాంకేతికత అందుబాటులో ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. గూగుల్ నిర్ణయం వల్ల తెలుగు డిజిటల్ మీడియా నిర్వాహకులకు అదనంగా రాబడి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలుగులో వెబ్సైట్లు, బ్లాగ్లు నిర్వహించేవారు ఇక పై గూగుల్ యాడ్ సెన్స్లోకి సైన్ ఇన్ అయి ప్రకటనలు పొందడమే కాకుండా తమ సైట్లలో ప్రకటనలు ఇచ్చేలా అడ్వర్టైజర్స్‌ను కూడా ఆకర్షించవచ్చని తెలిపింది. ‘గూగుల్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఈ సాంకేతికతపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి గూగుల్ ఇండియా వర్క్‌షాపులు కూడా నిర్వహించింది.
బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ దక్షిణాసియా, భారత్ ఉపాధ్యక్షుడు రాజన్ ఆనంద్ వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్ ఆధారంగా ఆదాయం పొందాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశం అని పేర్కొన్నారు. భారత్‌లోని ప్రాంతీయ భాషాభిమానులకు ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడం కోసమే గూగుల్ యాడ్స్ ఫ్లాట్‌ఫాంపై భారతీయ భాషలకు మద్దతు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రకటనకర్తలకు కూడా తమ ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఇవ్వడం సులభతరం అవుతుందన్నారు. ప్రస్తుతం భారతీయ భాషల్లో వెబ్సైట్లు చూస్తున్న వారి సంఖ్య 23.4కోట్లకు చేరుకుందని మార్కెట్ సొల్యూషన్స్-ఇండియా డైరెక్టర్ శాలినీ గిరీశ్ పేర్కొన్నారు. 2021 నాటికి వీరి సంఖ్య 53.6కోట్లకు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.