టెక్ దిగ్గజ కంపెనీల మీద గత కొన్నిరోజులుగా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూజర్ల డాటాకు భద్రత కరువైందని, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని, నైతిక విలువల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో యాప్ మార్కెట్, డెవలపర్స్ నుంచి గూగుల్ అడ్డగోలు కమిషన్ వసూలు చేస్తుందనే ఆరోపణల మీద దర్యాప్తులు నడుస్తున్నాయి.
ఇవేకాకుండా గూగుల్ క్లౌడ్ మార్కెట్‌ప్లేస్ నుంచి సాఫ్ట్‌వేర్‌ను ఇతరుల నుంచి కొన్నప్పుడు కూడా గూగుల్ కొంత పర్సంటేజ్ తీసుకుంటూ వస్తోంది. అయితే ఇది అడ్డగోలుగా ఉంటోందనే విమర్శ ఉంది.ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది.గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్ పర్సంటేజ్‌ను ఒక్కసారిగా 20 శాతం నుంచి 3 శాతానికి తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది.
దీంతో మధ్యవర్తులకు భారీగా ఊరట లభించనుంది.‘‘పోటీ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం, మిగతా కంపెనీలకూ అవకాశం ఇస్తూ పోటీతత్వాన్ని ప్రొత్సహించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామ’’ని గూగుల్ ప్రకటించుకుంది
ఈ ఏడాది మొదట్లో.. డెవలపర్స్ వార్షికాదాయంలో మొదటి 1 మిలియన్ డాలర్లు నుంచి సగం ఫీజు మాత్రమే యాప్ స్టోర్ సేవల కోసం వసూలు చేస్తామని గూగుల్ నిర్ణయించింది.అయితే గూగుల్ కంటే ముందే యాపిల్.. కిందటి ఏడాది నవంబర్‌లో పైనిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఇక వరుస విమర్శల నేపథ్యంలో జులై 1వ తేదీ నుంచి యాప్ స్టోర్ ఫీజులను 30 నుంచి 15 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది గూగుల్.