ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్న బ్యాడ్మింటన్‌ కోచ్‌

ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్న బ్యాడ్మింటన్‌ కోచ్‌

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే శిక్షణ సహాయ సిబ్బందిని అనుమతిస్తుండటంతో ఆయన గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.

జాతీయ కోచ్‌గా ఆయనకు అవకాశమున్నప్పటికీ సింగిల్స్‌ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ వ్యక్తిగత కోచ్‌ అగుస్‌ వి సాంటోసాకు చాన్స్‌ ఇవ్వాలని గోపీ తప్పుకున్నారు. ఒక్కో క్రీడాంశానికి గరిష్టంగా ఐదుగురు (ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలు) సహాయ సిబ్బంది మాత్రమే టోక్యోకు వెళ్లేందుకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అనుమతిస్తోంది.

పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్‌ తే సాంగ్‌ పార్క్‌… డబుల్స్‌ జంట సాతి్వక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి వెంట కోచ్‌ మథియాస్‌ బో… ఇద్దరు ఫిజియోలు (సుమాన్ష్‌ శివలంక, బద్దం ఇవాంజలైన్‌) వెళ్లనున్నారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఏడుగురు కోచ్‌లు వెళ్లేందుకు అవకాశమివ్వాలని ఐఓఏకు లేఖ రాసింది. కానీ ప్రస్తుత కరోనా ప్రొటోకాల్‌ ప్రకారం ఆటగాళ్ల సంఖ్యలో 33 శాతానికి మించి సహాయ సిబ్బందిని పంపే వీలులేకపోవడంతో ‘బాయ్‌’ వినతిని ఐఓఏ తోసిపుచ్చింది.