విభ‌జ‌న బాధిత ఏపీని కేంద్ర‌మే ఆదుకోవాలి… గ‌వ‌ర్న‌ర్

Narasimhan speech in AP Assembly Budget Sessions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభ‌జ‌న బాధిత ఏపీ సాగుతున్న తీరును గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వివ‌రించారు. ఏక‌ప‌క్ష విభ‌జ‌న కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు చాలా క‌ష్టాల్లో ఉన్నార‌ని, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్య‌త కేంద్రానిదేన‌ని గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగించారు. నూత‌న భ‌వ‌నాల్లో రెండోసారి బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ చాలా న‌ష్ట‌పోయింద‌ని, ప్ర‌ధాన ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయింద‌ని, రాజ‌ధాని లేని రాష్ట్రంగా మిగిలింద‌ని, రెవెన్యూలోటు, త‌క్కువ ఆదాయంతో క‌ష్టాలు మ‌రింత పెరిగాయ‌ని, ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌న్నీ కేంద్రం అమ‌లు చేయాల్సిఉంద‌ని, ఇందుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంతో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని తెలిపారు.

విభజ‌న స‌మ‌యంలో ఆస్తులు, అప్పులు పంచిన‌విధానం ఎంత లోప‌భూయిష్టంగా సాగిందో కూడా గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. ఇరు రాష్ట్రాల‌కు ఆస్తులు భౌగోళిక ప్ర‌దేశం ఆధారంగా పంచితే… అప్పులు మాత్రం జ‌నాభా ఆధారంగా పంచార‌ని వెల్ల‌డించారు. ఐదుకోట్ల ప్ర‌జ‌ల రాష్ట్రంగా విభ‌జ‌న క‌ష్టాలు అధిగ‌మించాలంటే కేంద్రంసాయం అనివార్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ది చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మ‌లుచుకుని ముందుకువెళ్తోంద‌ని తెలిపారు. స‌హ‌జసిద్ధ వ‌న‌రులు, తీర‌ప్రాంతం, అధిక‌నైపుణ్యం క‌లిగిన సిబ్బంది స‌హ‌కారంతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర‌భాగంలో నిలుపుతామ‌ని, అభివృద్ధి ఫ‌లాలు చిట్ట‌చివ‌రి వ్య‌క్తికి చేరేవ‌ర‌కు నిర్విరామంగా కృషిచేస్తున్నామ‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం ఏర్పడ్డాక శాంతిభ‌ద్ర‌త‌లపై ప్ర‌త్యేక దృష్టిపెట్టామ‌ని, అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌ర‌ణ చేశామ‌ని, పోలీసులు క‌న‌ప‌డ‌కుండా పోలీసింగ్ మాత్ర‌మే క‌న‌ప‌డేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. యువ‌త‌కు ఉపాధిక‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ముందుకు వెళ్తోంద‌ని, ప్ర‌యివేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధిని ప్రోత్స‌హిస్తోంద‌ని తెలిపింది. కియా మోటార్స్ క‌ర్మాగారం అనంత‌పురం జిల్లాకు ఒక గేమ్ ఛేంజ‌ర్ గా నిలిచింద‌ని, ఆటోమొబైల్ కేంద్రంగా అనంత‌పురం అభివృద్ధి చెందుతోంద‌ని, తిరుప‌తి ఎల‌క్ట్రానిక్ హ‌బ్ గా మారుతోంద‌ని, ఔష‌ధ‌, ఏరోస్పేస్, డిఫెన్స్, ఇంజినీరింగ్ ఉత్ప‌త్తుల హ‌బ్ గా విశాఖ‌, జౌళి, ఆహార శుద్ధి కేంద్రాలుగా కృష్ణా, గుంటూరు అభివృద్ధిచెందుతున్నాయ‌ని తెలిపారు. ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అమ‌రావ‌తి నిర్మాణం కాబోతోంద‌ని, అమ‌రావ‌తి ఒక ప‌రిపాల‌నా రాజ‌ధాని మాత్ర‌మే కాద‌ని, అంత‌ర్జాతీయ కేంద్రంగా భావిస్తున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు.