సీఎం కుమారుడిపై ప్రభుత్వ చర్యలు

సీఎం కుమారుడిపై ప్రభుత్వ చర్యలు

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విజయేంద్ర ఆలయంలో పూజలు చేసిన ఘటనపై లెట్‌కిట్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, న్యాయమూర్తి సూరజ్‌ గోవిందరాజ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

నంజనగూడు ఆలయానికి విజయేంద్ర వెళ్లడం నిజమేనని, 5నిమిషాలు మాత్రమే ఆయన ఆలయంలో ఉన్నారని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభులింగ ఈ ఘటనను సమర్థించే ప్రయత్నం చేశారు. దీనిపై హైకోర్టు మండిపడింది. ఆలయంలోకి ప్రవేశించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.