కరోనా వైరస్ కారణంగా… రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లపై ఎవరూ రాకూడదంటూ.. రైల్వే శాఖ ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్‌ను రూ. 50కి పెంచేసింది. దీంతో రైలు ప్రయాణికులు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. టిక్కెట్లు ఉన్న వారినే రానిస్తాం.. అలా రాని వాళ్ల కోసం ఒక్క సహాయకుడ్ని అనుమతిస్తామని.. చెబితే అయిపోయే దానికి.. టిక్కెట్ల బాదుడు ఎందుకో అర్థం కాని పరిస్థితి. వైరస్ పేరుతో.. ఖచ్చితంగా రైల్వేస్టేషన్‌కు రావాల్సిన వారిని బాదేసి.. డబ్బులు పిండుకునే ఆలోచనే తప్ప… ఇందులో. ..కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకునే జాగ్రత్త ఎక్కడ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాల్లో.. కరోనా వైరస్ కట్టడికి.. ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం.. వారికి మాస్క్‌లు పంపిణీ చేయడం.. శానిటైజర్లు అందుబాటులో ఉంచడం.. పబ్లిక్ ప్లేసుల్లో వైరస్ వ్యాప్తికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేస్తూంటాయి. కానీ ఇండియాలో మాత్రం.. వైరస్ అలర్ట్ రాగానే… రూ. రెండు మాస్క్‌ను.. ఏకంగా రెండు వందలు చేశారు. శానిటైజర్లు వందల రూపాయల్లో అమ్ముతున్నారు. ప్రభుత్వం తరపున ఎక్కడా కనీస జాగ్రత్తలు కనిపించడం లేదు.