మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలు

మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలు

కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌ గ్రేషియా సహాయాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మొత్తాన్ని స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ ద్వారా ఎక్స్‌గ్రేషియా ఇస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్‌ మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ఇవ్వనుంది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది.

కాగా ఇప్పటి వరకు దేశంలో 4.45 లక్షలమంది మహమ్మారి బారిన పడి మరణించారు. అయితే ఇప్పటి వరకు మరణించిన వారితోపాటు భవిష్యత్తులోనూ కోవిడ్‌తో ప్రాణాలు విడిచిన వారందరికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే సదరు వ్యక్తి కోవిడ్‌ మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే బిహార్‌ కోవిడ్‌తో మరణించిన వారికి లక్షలు, మధ్యప్రదేశ్‌ లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.