ఏపీకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్..కానీ ఇలా చేయాల్సిందే..!

లాక్‌డౌన్ వేళ కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారితో పాటూ అత్యవసరంగా సొంత ఊర్లకు వెళ్లేవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అందుకోసం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులు, ఇతర అంశాలను చూసేందుకు స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్‌లను నియమించారు. ఏపీలో సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుకు ఈ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసింది.

అవేమంటే.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారంతా స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కృష్ణబాబు తెలిపారు. spandana.ap.gov.inలో అనుమతి కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం ఇచ్చామని.. ఏపీకి వెళ్లాలనుకునేవారికి ఏర్పాట్లు చేయాలని కోరామని అన్నారు. ఏపీకి చెందినవారు రాజస్థాన్‌లో 9వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తమిళనాడులో ఉన్న మత్స్యకారులను కూడా తీసుకొస్తామని వివరించారు. అలాగే.. మహారాష్ట్ర వలస కూలీలను సొంతూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. శ్రామిక్‌ రైళ్లలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని అన్నారు.

కూలీలకు మాత్రమే పాస్‌లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా వివిధ దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 10,500 మంది రిజిస్టర్‌ చేసుకున్నారని కృష్ణబాబు చెప్పారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి పర్మిషన్‌ ఇవ్వాలని నిర్ణయించామని.. అనుమతులు లేకుండా సరిహద్దుల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వమని తేల్చి చెప్పారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోలేని వారు తహశీల్ధార్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చని కృష్ణబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.