వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేసింది. గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఇదే కథాంశంగా సినిమాను తెరకెక్కించాలని రామ్ గోపాల్‌వర్మ నిర్ణయించుకున్నారు.
తమ అనుమతి లేకుండా రామ్‌గోపాల్‌వర్మ సినిమాను తీస్తున్నారంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. అమృత మొదట నల్గొండ కోర్టును ఆశ్రయించగా చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై వర్మ హైకోర్టును ఆశ్రయించగా సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. వారి పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ హామీ ఇవ్వడంతో ఇక ఏ అడ్డంకులు లేకుండా విడుదల కానుంది. అనంతరం రామ్‌గోపాల్‌వర్మ ట్విటర్ వేదికగా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. మర్డర్ చిత్రం తెరకెక్కడం వెనుక ఉన్న మా మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్థం చేసుకుంది. అన్ని విషయాలను కోర్టు ఆర్డర్ వచ్చిన తరువాత వెల్లడిస్తాను అంటూ వర్మ ట్వీట్ చేశారు.