విద్యుత్ వాహనాలపై జీఎస్టీ 12% నుంచి 5శాతానికి తగ్గింపు

gst decreased on electric vehicles

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. శుక్రవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్ వాహనాల కొనుగోలు రుణా ల వడ్డీపై రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ కల్పించనున్న ట్టు ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల పూర్తి రుణ చెల్లింపు కాలవ్యవధిలో ప్రతీ వినియోగదారుడికి రూ. 2.5 లక్షల వరకు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. పర్యావరణానికి మేలు చేసే లక్ష్యంతో.. విద్యుత్తుతో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేసినట్టు ఆమె వెల్లడించారు. విద్యుత్తు వాహనాల ధరల్ని అందరికీ అందుబాటులో తేవడానికి ఆ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తెచ్చే విధంగా ప్రభుత్వం జీఎస్టీ మండలికి సిఫారసులు చేసిందని ఆమె అన్నారు. విద్యుత్తు వాహనాల ధరలు అందరికీ అందుబాటులో ఉంచడానికి ఆయా వాహనాల కొనుగోలు రుణాల వడ్డీపై రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ కల్పిస్తాం అని నిర్మల తెలిపారు.

విద్యుత్తు వాహనాల తయారీ కి భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మారుస్తామని ఆమె అన్నారు. 2023నాటికి అన్ని ద్విచక్ర వాహనాలు, 2025నాటికి అన్ని త్రిచక్ర వాహనాలు విద్యుత్తుతో నడిచేవిధంగా చర్యలు తీసుకోవాలన్న నీతి ఆయోగ్ సూచనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ ఉద్దీపన ప్రకటించారు. విద్యుత్తు వాహనాల్లో ఉపయోగించే కొన్ని పరికరాలపై కస్టవ్‌‌సు డ్యూటీని మినహాయిస్తున్నట్టు కూడా ఆమె తెలిపారు. విద్యుత్తు వాహనాల్ని ప్రోత్సహించడం కోసం ఎఫ్‌ఏఎంఈ 2 (ఫేమ్ 2) పథకం కింద ఏప్రిల్ 1, 2019 నాటికి రూ .10వేల కోట్ల నిధులకు ఆమోదం తెలిపినట్టు ఆమె తెలిపారు. అత్యాధునిక బ్యాటరీ, రిజిష్టరైన విద్యుత్తు వాహనాలకు మాత్రమే ఈ పథకం, ప్రోత్సాహకాలు అందుతాయి అని ఆమె అన్నారు. మరోవైపు, భారతదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులను తయారుచేసే సంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచ స్థాయి సంస్థలు భారత్‌లో తమ తయారీ ప్లాంట్‌లను ప్రారంభించే విధంగా ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకురానున్నది. పారదర్శకంగా ఈ బిడ్డింగ్ జరుగుతుంది. ఆదాయపు పన్ను చట్టం 35 ఏడీ కింద ఆయా సంస్థలకు పన్ను మినహాయింపులు, పరోక్ష పన్ను రాయితీలు లభిస్తాయి అని అన్నారు. సోలార్ ఫొటో వోల్టాయిక్ సెల్స్, లిథియం స్టోరేజ్ బ్యాటరీలు, సోలార్ ఎలక్ట్రిక్ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, కంప్యూటర్ సర్వర్లు, ల్యాప్‌టాప్ తదితర తయారీ సంస్థలు ఈ పథకం కిందికి వస్తాయని ఆమె అన్నారు.

కొనుగోలుదారులకు, తయారీదారులకు నూతనోత్సాహం

– పారిశ్రామిక నిపుణులు 
విద్యుత్తు వాహనాలపై కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇటు కొనుగోలుదారులకు, అటు తయారీదారుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ అన్నారు. రుణాల వడ్డీపై రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ నిర్ణయం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే విషయమని అథర్ ఎనర్జీ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మహతా అన్నారు.