కాంగ్రెస్‌ చీఫ్‌కు ‘ఆప్‌’ భారీ ఆఫర్‌

కాంగ్రెస్‌ చీఫ్‌కు ‘ఆప్‌’ భారీ ఆఫర్‌

ఎన్నికల వేళ గుజరాత్‌ పాలిటిక్స్‌లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు.. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్‌ పటేల్‌ హస్తం పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో తమ పార్టీలో చేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా కోరారు.

శుక్రవారం ఇటాలియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌ పటేల్‌ వంటి అంకిత భావంతో పనిచేసే వ‍్యక్తికి కాంగ్రెస్‌ పార్టీలో స్థానం ఉండదు. పటేల్‌కు కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టం లేకపోతే వెంటనే ఆప్‌లో చేరాలి. పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు ఆప్‌ గౌరవమిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. హార్దిక్‌ పటేల్‌ సమయం వృథా చేసుకోకుండా ఆప్‌లో చేరండి. ఆప్‌ గెలుపునకు సహకరించండి’’ అని అన్నారు. ఇటాలియా ఇలా కామెంట్స్‌ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా, అంతకు ముందు హార్దిక్‌ పటేల్‌.. రాష్ట్ర పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్‌ అధిష్టానం కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ కోసం ‘‘2017లో మీరు హార్దిక్‌ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్‌ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్‌ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్‌ పటేల్‌నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్‌ టెంపుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నరేష్‌ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది.