గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం పటేల్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించటంతో 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. జులై 24, 1928లో జునాగద్ జిల్లాలోని విశవదార్ పట్టణంలో పటేల్ జన్మించారు. 1945లో ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారకునిగా చేరారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు సైతం వెళ్లారు. 1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1977లో రాజ్‌కోట్ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం తన పదవికి రాజీనామా చేసి బాబుభాయ పటేల్ ‘జనతా మోర్చ్’ ప్రభుత్వంలో చేరారు.
1978నుంచి 1980వరకు వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. 1995లో మొట్టమొదటి సారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల 7 నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1998 మార్చి నెలలో మరోసారి సీఎం పదవిని చేపట్టారు. అనారోగ్య కారణాల దృష్ట్యా మరోసారి 2001లో పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యం వల్ల గత కొన్ని సంవత్సరాలనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత నెలలో ఆయన కరోనా వైరస్ బారిన పడికోలుకున్నారు.