భయాందోళనలో అఫ్గానిస్తాన్‌ ప్రజలు

భయాందోళనలో అఫ్గానిస్తాన్‌ ప్రజలు

తమ దేశం తాలిబన్ల వశమవడంతో అఫ్గానిస్తాన్‌ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రాణభయంతో విదేశాలకు పారిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆ దేశ రాజధాని కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎ‍త్తున ప్రజలు విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇతర దేశాలకు వెళ్లేందుకు ఆ దేశ ప్రజలు విమానాశ్రయానికి వేల సంఖ్యలో రావడంతో ఎయిర్‌పోర్ట్‌ కిటకిటలాడింది. రద్దీ తీవ్రమవడంతో భద్రతా బలగాలు చక్కదిద్దేందుకు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన సోమవారం జరిగింది.

తాలిబన్లు మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ అఫ్గానిస్తాన్‌ వదిలి పరారయ్యాడు. ఇక ప్రజలు కూడా దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. దేశానికి ఉన్న అన్ని సరిహద్దులు మూసివేయడంతో ఉన్న ఒకే ఒక్క దారి వాయుమార్గం. దీంతో విమాన ప్రయాణం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు రావడంతో ప్రయాణికుల టెర్మినల్‌ నిండిపోయింది. ఒక్కో విమానం వద్ద వందలాది మంది ఉన్నారు. అయితే విమాన ప్రయాణాలను అఫ్గాన్‌ నిషేధించింది. ఇతర దేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి.