సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌లో కాల్పుల కలకలం

సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌లో కాల్పుల కలకలం

దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ 122వ బెటాలియన్‌లో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ దశరథ్‌సింగ్‌(56)ను ఎస్‌ఐ కర్నేల్‌సింగ్(55) కాల్చి చంపారు. అనంతరం ఎస్‌ఐ కర్నేల్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన లోధి ఎస్టేట్‌లోని హోంమంత్రి భవనం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ దశరథ్‌సింగ్, ఎస్‌ఐ కర్నేల్‌సింగ్ మధ్య శుక్రవారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఎస్‌ఐ తన సర్వీస్‌ గన్‌తో ఇన్‌స్పెక్టర్‌ దశరథ్‌ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో దశరథ్‌సింగ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అదే గన్‌తో ఎస్‌ఐ కర్నేల్‌ సింగ్‌ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ కర్నేల్‌సింగ్‌ జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌కు చెందినవారు కాగా, ఇన్‌స్పెక్టర్ దశరథ్‌సింగ్ హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు.