పులివెందులలో కాల్పుల ఘటన

పులివెందులలో కాల్పుల ఘటన

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో మంగళవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కొమ్మా శివప్రసాద్‌రెడ్డి(60), ఆయనకు సోదరుడి వరుసైన భూమిరెడ్డి పార్థసారథిరెడ్డి(45)లు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. శివప్రసాద్‌రెడ్డి, పార్థసారథిరెడ్డిలు నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఎదురెదురుగా ఉన్న ఇళ్లలో నివాసముండేవారు.

పార్థసారథిరెడ్డి గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. అయితే కొంత కాలంగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. భార్యతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించి కొమ్మా శివప్రసాద్‌రెడ్డి పంచాయితీ చేశారు. పంచాయితీలో పార్థసారథిరెడ్డి తన భార్యను అందరి ముందే తిడుతుండగా ఇది సరికాదంటూ శివప్రసాద్‌రెడ్డి పార్థసారథిరెడ్డిపై చేయి చేసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకుని తనకు అనుకూలంగా పంచాయితీ చేయకపోగా, చేయి చేసుకున్నాడన్న కోపంతో కొమ్మా శివప్రసాద్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు.

గత ఎంపీటీసీ ఎన్నికల్లో కొమ్మా శివప్రసాద్‌రెడ్డికి పోటీగా పార్థసారథిరెడ్డి నామినేషన్‌ వేయాలని ప్రయత్నించి, ఎవరూ మద్దతు పలకకపోవడంతో విరమించుకున్నాడు. కొమ్మా శివప్రసాద్‌రెడ్డిని తరచూ దుర్భాషలాడేవాడు. 2019లో ఒకసారి కొమ్మా శివప్రసాద్‌రెడ్డి ఇంటిపై పెట్రోలు పోసి దాడి చేశాడు. ఈ నేపథ్యంలో కొమ్మా శివప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పార్థసారథిరెడ్డిపై అప్పట్లో పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.