రాజధాని నగరంలో తుపాకుల వ్యాపారం ముఠా గుట్టు రట్టయింది. స్పెషల్ టాస్క్ఫోర్సు (ఎస్టీఎఫ్) చేపట్టిన దాడుల్లో నిందితులు పట్టుబడ్డారు. నగరంలో మారణాయుధాల విక్రయ సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ముందస్తు సమాచారం ఆధారంగా ఎస్టీఎఫ్ సోమవారం చేపట్టిన దాడులు ఫలప్రదమయ్యాయి. ఈ దాడుల్లో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని స్థానిక ప్రైవేట్ కళాశాలలో బీబీఏ విద్యార్థిగాగుర్తించారు. మారణాయుధాల అక్రమ లావాదేవీల్లో విద్యార్థి ప్రధాన నిందితుడు కావడం సర్వత్రా కలకలం సృష్టించింది.
నిందితుడిని ఝార్కండ్ నుంచి వచ్చిన షాను పొద్దార్గా గుర్తించారు. 7.65 మిల్లీమీటర్ల మూడు ఆటోమేటిక్ పిస్తోళ్లతో ఐదు మ్యాగజైన్లు, 22 రౌండ్ల పేలని తూటాల్ని స్వాధీ నం చేసుకున్నారు. స్థానిక ఖండగిరి ఐటీఆర్ కళాశాల ప్రాంతంలో సురేష్ పాణిగ్రాహి అనే వ్యక్తికి ఈ ఆయుధాల్ని విక్రయించేందుకు వచ్చి నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఒక్కో తుపాకీ రూ.1 లక్ష వెలతో విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం మేరకు ఆయుధాలు ఏర్పాటు చేసినట్లు నిందితుడి ప్రాథ మిక సమాచారం. తుపాకులపై ఉన్న ముద్రలను బట్టి అవి కిర్కీ (పూణే) ఆయుధాగారం నుంచి బయటపడినట్లు తెలుస్తోందని స్పెషల్ టాస్క్ఫోర్స్ డీఐజీ జె.ఎన్.పంకజ్ తెలిపారు.
మావోయిస్టు వర్గాలతో నిందితుడికి రహస్య సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఈ ఆయుధాల సేకరణ, క్రయ–విక్రయాలు, సరఫరా–కొనుగోలు వగైరా సమాచారం ఆరా తీసేందుకు విచారణ పటిష్టంగా నిర్వహిస్తున్నారు. తెర వెనుక ముఠా గుట్టు తెలుసుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కృషి చేస్తోంది. నిందితులను కోర్టులో హాజరుపరిచి అభ్యర్థించి త్వరలో రిమాండ్కు తీసుకుని మారణాయుధాల లావాదేవీల్లో నిందితుడి పాత్ర, అనుబంధ వర్గాల గుట్టురట్టు కోణంలో ప్రశ్నిస్తామని ఎస్టీఎఫ్ డీఐజీ పంకజ్ తెలిపారు.