Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను దోషిగా నిర్దారిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో హర్యానాలోని పంచకులలో శాంతి భద్రతలు అదుపుతప్పిన సంగతి తెలిసిందే. దీనిపై హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజకీయ లబ్ది కోసమే పంచకులను తగలబడేలా చేస్తున్నారని మండిపడింది. ఆందోళనకారులకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిందని, పరిస్థితి తీవ్రతరం కావటానికి ప్రభుత్వమే అనుమతి ఇస్తోందని కీలక వ్యాఖ్యలు చేసింది.
డేరా బాబా అనుచరులు చేస్తున్న దాడిలో ధ్వంసమవుతున్న ఆస్తులకు… బాబా ఆస్తులు అమ్మి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అత్యాచార కేసులో గుర్మీత్ దోషంటూ పంచకుల కోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది సేపటికే ఆ ప్రాంతం రణరంగంలా మారింది. డేరా మద్దతుదారులు, అనుచరులు ఇష్టంవచ్చినట్టుగా రెచ్చిపోయి హింసకు దిగారు. వారి దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందికి పైగా గాయపడ్డారు. తీర్పు వెలువడిన వెంటనే డేరా మద్దతుదారులు వందలమంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులను ధ్వంసం చేసి ఇష్టారీతిగా తగలబెట్టారు. కోర్టు తీర్పుతో డేరా అనుచరులు ఎక్కువగా ఉండే హర్యానా, పంజాబ్, చండీగడ్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనలను మరింత పెరగకుండా ఈ ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు.
అయితే ఈ నిబంధన విషయంలో స్పష్టత ఇవ్వకపోవటంతో అల్లర్లు ఇంకా పెచ్చుమీరాయి. ఆయుధాలతో కనిపిస్తే మాత్రమే చర్యలు తీసుకుంటామని 144 సెక్షన్ విధించిన డీసీపీ అశోక్ కుమార్ చెప్పటంతో ఆయుధాలు లేకుండా ఆందోళన కారులు రెచ్చిపోయారు. డీసీపీ ప్రకటన వల్లే హింస పెరిగిందని భావిస్తోన్న ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది అటు ఆశ్రమాల్లో ఉన్న మద్దతుదారులను ఖాళీచేయించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు గుర్మీత్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి జగదీప్ సింగ్ కు భద్రత పెంచాలని హర్యానా ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. పంజాబ్, హర్యానాలో హింసా కాండ నేపథ్యంలో గుర్మీత్ కు శిక్షపడటానికి కారణమైన ఇద్దరు బాధితురాళ్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డేరా బాబా శిష్యగణం తమను బతకనివ్వదేమోనని వారు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే వారు ఇప్పుడు ఎక్కడున్నారన్న సమాచారం ప్రభుత్వం బయటకు పొక్కనివ్వటం లేదు. కాగా, వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయిన డేరా బాబాకు రోహ్ తక్ జైలులో సకల భోగాలూ అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. జైల్లో ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించటమే కాకుండా ప్రత్యేక రూమ్, సహాయకుడిని ఏర్పాటుచేశారు. బాబాకు దత్తపుత్రికగా చెప్పుకుంటున్న బాలీవుడ్ దర్శకురాలు జీతూ ఆయనకు సకల మర్యాదలూ చేస్తున్నారు. అటు 100 ఎకరాల్లో ఉన్న బాబా ఆశ్రమాన్ని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రత్యేకమైన రూమ్లు, మసాజ్ సెంటర్లు, విలాసవంతమైన భవనాల తో డేరా బాబా ఆశ్రమం ఇంద్రభవనాన్ని తలపిస్తోంది..
మరిన్ని వార్తలు: