తెలంగాణ తెచ్చిన పార్టీగా వరుసగా బిఆర్ఎస్ రెండు సార్లు ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది . ఇప్పుడు మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అయితే తెలంగాణ సెంటిమెంట్, కేసిఆర్ ఇమేజ్ తో బిఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. వారు కూడా పార్టీ తో పాటు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
గత రెండు ఎన్నికల్లో గువ్వల బిఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. వాస్తవానికి అచ్చంపేట టిడిపి కంచుకోట. టిడిపి నుంచి పి. రాములు మూడుసార్లు గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టిడిపి నష్టపోయింది. దీంతో 2014లో కాంగ్రెస్ అభ్యర్ధి చిక్కుడు వంశీకృష్ణపై బిఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు విజయం సాధించారు. టిడిపి నుంచి రాములు పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఇక 2018 ఎన్నికల్లో మళ్ళీ గువ్వల బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి కేసిఆర్ వేవ్ లో గెలిచేశారు. కాంగ్రెస్ నుంచి వంశీ మళ్ళీ పోటీ ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గువ్వల ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సారి ఆయనకు పరిస్తితులు అనుకూలంగా లేవు. కాస్త ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే ఈ 9 ఏళ్లలో అనేక ఆరోపణలు వచ్చాయి.
ఇటు వరుసగా ఓడిపోతున్న వంశీపై సానుభూతి ఉంది. ప్రజల్లో తిరుగుతూ ప్రజా మద్ధతు పెంచుకుంటున్నారు. గత ఎన్నికల్లోనే 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి గువ్వలకు హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చేలా లేరు. చూడాలి మరి అచ్చంపేటలో ఈ సారి పైచేయి ఎవరిదో.