చంద్రబాబు ఒప్పుకున్నారు…కానీ ఇప్పుడేమో !

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా జీవీఎల్ మాట్లాడుతూ ఎప్పరిలాగే తెలుగుదేశాన్ని టార్గెట్ చేశారు. మరదేమిటో ఈసారి వైసీపీని కూడా టీడీపీ గాటనే కట్టారు. ప్రత్యేక హోదా వస్తే 100 శాతం పన్ను రాయితీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలను అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విభజన చట్టంలో ఏముంది? అసలు ప్రత్యేక హోదా పేరిట నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినదేమిటి? ఏపీ ప్రభుత్వం ఎంత సాయం అందింది? వంటి విషయాలను జీవీఎల్ వివరించే ప్రయత్నం చేశారు.
ప్రత్యేక హోదా అంటే ఏంటో మిగతా ఎంపీలకి చెప్పే ప్రయత్నం చేశారు.

రాష్ట్రాన్ని అత్యుత్తుమ స్థాయిలో నిలపడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడమని చెప్పారు. అంతేకానీ రాష్ట్ర ప్రజలందరికీ 100 శాతం పన్ను రాయితీ ఇవ్వడం కాదన్నారు. కానీ, ఏపీలో పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరిట ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తోందని జీవీఎల్ వెల్లడించారు. దీనికి సంబంధించి 2017 మార్చి 15న క్యాబినెట్ విడుదల చేసిన నోట్‌ను జీవీఎల్ చదివి వినిపించారు. ‘ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం అందుతుంది. దీనిలో భాగంగా ఐదేళ్లపాటు కేంద్ర నుంచి ఏపీకి అదనంగా నిధులు అందుతాయి. అంటే ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తారు’ అని నోట్‌లో వివరాలను జీవీఎల్ చదివి వినిపించారు.

దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సానుకూలంగా స్పందించారని అప్పట్లో అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం కూడా ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మార్చి 16న శాసన మండలిలో చంద్రబాబు చేసిన ప్రకటనను కూడా జీవీఎల్ తెలుగులో చదివి వినిపించారు. ఈ ప్యాకేజీ నిర్మాణంలో సుజనా చౌదరి ఆర్కిటెక్చర్‌గా వ్యవహరించారని టీడీపీ నిర్వహించిన మహానాడులో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు వీరి మాటలు చూస్తుంటే కొత్త పార్టీ ఏమైనా మాట్లాడుతోందా అనిపిస్తోందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు ప్యాకేజీని మనస్పూర్తిగా స్వీకరించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేకిస్తోందని జీవీఎల్ విమర్శించారు. బీజేపీ వల్లే ఏపీకి నిధులు, ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. ఏపీపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టి సాయం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ, వైసీపీ ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.