ఆర్‌ఎక్స్‌ 100 నైజాం కలెక్షన్స్‌కు దిమ్మ తిరిగి పోతుంది

RX 100 12 Days collections,10 crores in nizam area

ఈమద్య కాలంలో చిన్న చిత్రంగా విడుదలైన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేస్తుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే పెట్టుబడిని రికవరీ చేసింది. ఇక ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తుంది. మొదటి వారం రోజుల్లో 12 కోట్ల షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం రెండవ వారం తర్వాత చల్లపడి పోతుందని అంతా భావించారు. కాని గత వారం వచ్చిన మూడు నాలుగు చిత్రాల్లో ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించడంలో సఫలం కాలేదు. దాంతో ఆర్‌ఎక్స్‌100 చిత్రం మరో వారం పాటు తన జోరును కొనసాగించే అవకాశం దక్కింది. ఈ చిత్రం నైజాం ఏరియాలో దుమ్ము రేపే కలెక్షన్స్‌ను నమోదు చేస్తుంది.

కేవలం స్టార్‌ హీరోలకు మాత్రమే నైజాం ఏరియాలో 10 కోట్ల గ్రాస్‌ సాధ్యం అవుతుంది. అలాంటిది ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి ట్రేడ్‌ వర్గాల వారికి సైతం దిమ్మతిరిగి పోయే షాక్‌ ఇచ్చింది. నైజాం ఏరియాలో 5.1 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం 50 లక్షలకు నైజాం డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను నిర్మాత అమ్మేందుకు ప్రయత్నించిన సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్‌ దండం పెట్టి వెళ్లి పోయాడట. ఇప్పుడు ఈ చిత్రం ఫలితం చూసి ఆ డిస్ట్రిబ్యూటర్‌ కుమిలి కుమిలి ఏడుస్తు ఉంటాడు. నైజాంతో పోల్చితే ఇతర ఏరియాల్లో కాస్త తక్కువ జోరు కొనసాగుతుంది. కాని ఇతర సినిమాలతో పోల్చితే ఇదే పై చేయి సాధించింది. మొత్తంగా ఈ చిత్రం 15 కోట్ల షేర్‌కు దగ్గరగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని భాషల శాటిలైట్‌ రైట్స్‌కు భారీ డిమాండ్‌ ఉంది. ఈ చిత్రంతో నిర్మాతకు కాసుల పంట పండినట్లే.