టీడీపీ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళుతూంటే చంద్రబాబుకు మాత్రం ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్నారని, ఓటమి భయంతో టిడిపి తీవ్ర ఒత్తిడిలో ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ఈ సారి అధికారం మూడునాళ్ళ ముచ్చటేనని , అమరావతి లో కనీసం అసెంబ్లీ భవనాన్నైనా సరిగా కట్టకపొవడం ప్రభుత్వ వైఫల్యమే అని ఆయన విమర్శించారు. ప్రజాధనాన్ని వెనుకేసుకోవడానికే చంద్రబాబు ఆరాటం తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని, సెక్రటేరియట్ నిర్మించలేని చంద్రబాబు ఒలంపిక్స్ నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి అధికారులు కూడా అవినీతిపరులుగా మారారని ఆయన ఆరోపించారు. అవినీతికి చట్టబద్ధత కల్పించిన ఘనులు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీ ఫిషరీస్ ద్వారా రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్యంలో లోటు అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.