2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోక భంగపడ్డ భారత క్రికెటర్లు, క్యాష్ రిచ్ లీగ్ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా కానీయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడేందుకు వెళ్లనుండగా.. మరో టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విహారితో సహా మొత్తం ఏడుగురు భారత ప్లేయర్లు డీపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
వాస్తవానికి భారత ప్లేయర్లకు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనే అవకాశం లేదు. అయితే డీపీఎల్.. బంగ్లాదేశ్ లిస్ట్ ఏ క్రికెట్ టోర్నీ కావడంతో భారత క్రికెటర్లకు అనుమతి లభించింది. భారత క్రికెటర్లు డీపీఎల్‌లో పాల్గొనడం కొత్తేమీ కాదు. కోవిడ్‌కు ముందు కూడా విహారి, ఈశ్వరన్, అపరాజిత్, మెనరియా ఈ టోర్నీలో పాల్గొనగా అంతకుముందు దినేశ్ కార్తీక్, మనోజ్ తివారి, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా స్టార్లు వివిధ సీజన్లలో బంగ్లాదేశ్ లిస్ట్ ఏ టోర్నీలో పాల్గొన్నారు. ఈ సీజన్‌లో భారత ప్లేయర్లే కాకుండా పాక్, జింబాబ్వేలకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు.
వీరిలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి, పాక్ వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా నిలువనున్నారు. ప్రస్తుత డీపీఎల్ సీజన్ మార్చి 15న ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ మెగా వేలం 2022లో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓ మోస్తరుగా రాణించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విహారి.. 3 ఇన్నింగ్స్‌ల్లో ఓ అర్ధ సెంచరీ సాయంతో 41.33 సగటున 124 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. విహారి ఐపీఎల్‌లో చివరిసారి 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు.