Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా ఇండస్ట్రీ మామూలుగా జనాల్లో ఒక సిల్లీ అభిప్రాయం ఉంటుంది అదేంటంటే సినీ నేపధ్యం వుంటే చాలు టాలెంట్ లేకపోయినా, అందంగా లేకపోయినా ఎలాగోలా ఇండస్ట్రీలో నెగ్గుకు రావచ్చు అని. కానీ అది ఒక్కటే సరిపోదు ఇక్కడ నిలబడాలంటే టాలెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని తెలుగు మాచో స్టార్ గోపిచంద్ ని చూస్తే అర్ధం అవుతుంది. ఎందుకంటే మొదటి నుండి గోపీచంద్ ది సినీ నేపధ్యం వున్న కుటుంబమే. తండ్రి టి కృష్ణ దర్శకులు. అయితే గోపి సినిమాలకు రాకముందే ఆయన మరణించారు. రష్యాలో ఇంజనీరింగ్ చదువుకున్న గోపి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఆయన సినీ ప్రయాణం ఏమంత సులువుగా సాగలేదు. గోపిచంద్ తొలివలపుతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఆయన తొలి సినిమా 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. కానీ ఈ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో గోపిచంద్‌కు తనను తాను నిరూపించుకోవాలన్న కసి బాగా పెరిగింది. అంది వచ్చిన అవకాలన్నింటినీ ఆయన ఉపయోగించుకున్నారు. అందుకే మొదటి సినిమా తొలివలపులో హీరోగా నటించిన గోపిచంద్, తర్వాత జయం చిత్రంతో విలన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో అసలు సిసలు తెలుగు విలన్‌గా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పొందారు. ఆ ఏడాది ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. తర్వాత వర్షం సినిమాతో మరోసారి విలన్ పాత్రకు న్యాయం చేశారు. ఇలా వరుసగా పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించారు. గోపిచంద్ అంటే కుర్ర హీరోలకి యాప్ట్ విలన్ అనే ముద్ర వేసుకున్నారు.
గోపిచంద్ మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించాలనుకున్నారు. ఈసారి తన తండ్రి మిత్రుడు ఆయన బాబాయి అని పిలుచుకునే ఈతరం ఫిలిమ్స్ పోకూరి బాబారావు నిర్మాతగా, ఎయస్ రవికూమార్ చౌదరి దర్శకత్వంలో యజ్ఞం సినిమా చేశారు. హీరోగా సూపర్ హిట్ అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మాస్ హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. రణం, రారాజు, లక్ష్యం, ఒక్కడున్నాడు, శౌర్యం, ఒంటరి, గోలీమార్, వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకోగా మధ్యలో అపజయాలు ఎదురైనా మళ్లీ పుంజుకున్నారు. మళ్ళీ లౌక్యం, జిల్, గౌతమ్ నంద చిత్రాలత సూపర్ ఫాల్ లోకి వచ్చిన గోపికి ఇప్పుడు ‘పంతం’ అంటూ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు మాచో హీరో గోపీ చంద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.