‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీ రివ్యూ & రేటింగ్

Happy-Wedding-Review

నటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, నరేష్ తదితరులు

దర్శకుడు: లక్ష్మణ్ కార్య

నిర్మాత: యువి క్రియేషన్స్ & పాకెట్ సినిమా

సంగీతం: శశికాంత్ కార్తీక్

సినిమాటోగ్రఫీ: బాల రెడ్డి

చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘హ్యాపీ వెడ్డింగ్’ మంచి ముహూర్తం చూసుకొని థియేటర్ లోకి అడుగుపెట్టింది. మెగా హీరోయిన్ నిహారికని ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దామా అన్న మెగా ఫాన్స్ ఉత్సుకతకు తెరపడి, సినిమా తెర లేచింది. ఆ పెళ్లి ఎలా జరిగిందంటే….

కథ:

ఆనంద్(సుమంత్ అశ్విన్) విజయవాడ కుర్రాడు, అక్షర(హైదరాబాద్) అమ్మాయి. ఆనంద్ ఒక స్క్రిప్ట్ రైటర్, అక్షర ఫాషన్ డిజైనర్. ఆనంద్ కెరీర్ మీద దృష్టి పెట్టకుండా ఆకతాయిగా తిరిగేవాడు, అక్షర దానికి వ్యతిరేకం అలాగే ప్రతీ విషయానికి కన్ఫ్యూజ్ అవుతుంది. అనుకోకుండా వీరిద్దరూ ప్రేమలో పడతారు, వెనువెంటనే పెళ్ళికి సిద్దమయిపోతారు కూడా. ఇద్దరి ఇంట్లో వాళ్ళు కూడా పెళ్ళికి ఒప్పుకొని పెళ్ళికి అంతా కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, పెళ్ళికి ఇంకా సమయం ఉండడంతో అక్షర ఏవేవో ఆలోచనలు మొదలవుతాయి. అయితే, ఆ ఆలోచనలు ఏంటి, వాటికి గల కారణాలు ఏంటి, ఆఖరికి పెళ్లి జారుతుందా లేదా…? అనేవి తెరపై చూడాలి.

పరిశీలన:

పెళ్లి కుదిరాక ఒక అమ్మాయి ఆలోచనలు, ఆ పరిస్థితులు అనే అంశం చుట్టూ కథని తిప్పాడు దర్శకుడు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, యువతని ఆకర్షించే విధంగా కూడా సినిమాను తెరకెక్కించారు. అన్ని అంశాలను బ్యాలెన్సు చేస్తూ సినిమాను ఆసక్తికరంగానే నడిపాడు. అయితే, ఫస్ట్ హాఫ్ లో కథ మూలాన్ని గట్టిగా పట్టుకొని నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం తగ్గాడనే చెప్పాలి. కానీ, వినోదం పరంగా ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ బావుంటుంది. అంతే కాకుండా, సినిమాలో అమ్మాయి ఆలోచనలతో జరిగే సంఘర్షణను మరి కొంచెం బాగా చూపించి ఉండుంటే బావుందనిపించింది. కానీ, హీరో హీరోయిన్ ల మధ్య సినిమాలో జరిగే కథనాలు నిజ జీవితంలో జరిగే వాటిలా అనిపిస్తాయి, కొంతమందికి ఆ ఫీల్ ని తీసుకువస్తాయి. సినిమాలో వినిపించే మాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. మాటల రచయిత భవానీప్రసాద్ తన కలంతో ఈ కాలానికి అనుగుణంగా ఉండే ఆలోచనలకు దగ్గరగా సంభాషణలు రాసారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా నడిపించే ప్రయత్నమే ఎక్కువగా ఉంది. కొన్ని కొన్ని ఆలోచనలను పరిచయం చేస్తూ, మరి కొన్ని జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ సినిమా ఫ్యామిలీతో చూసే విధంగా ఉంటుంది.

పాటలు బాగానే ఉన్నాయ్, కెమెరా పనితనం కూడా బావుంది, కొత్త దర్శకుడు అయినా కూడా కథని నడిపిన తీరు అతనికి మరిన్ని అవకాశాలు తెచిపెట్టేలానే ఉన్నాయి. నిహారిక నటనలో ఏ కొరత లేదనే చెప్పాలి, అలాగే సుమంత అశ్విన్ కూడా బాగానే చేశాడు. ఇక ఇతరత్రా పాత్రలలో అందరూ బాగానే చేసారు. మొత్తానికి సినిమా సకుటుంబ సపరివారంతో చూసే విధంగా ఉందని మాత్రం చెప్పగలం.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్: హ్యాపీ వెడ్డింగ్… బాగానే జరిగినట్టుగా ఉంది…

తెలుగు బుల్లెట్ రేటింగ్: 3/5